FLASH

tml"/>Get this Widget"WELCOME TO OUR UNION BLOG "
tml"/>Get this Widget" యూనియన్ వార్తలు, గవర్నమెంట్ ఆర్డర్స్ ,సర్కులర్స్,లేటెస్ట్ న్యూస్ ల తో మీ ముందుకు వస్తున్నాము.మీ యొక్క మద్దత్తు కోరుతూ మీ సెక్రటరీ [KONDABABU] "

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

Article on privatization of vizag steel plant

*/విశాఖ ఉక్కు-ప్రై'వేటు' హక్కు/*

*"విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు'' అని మనం ఇంత వరకు విన్నాం.ఇక నుంచి ఆ పదాల్లో ఒకటి మారబోతున్నది.''విశాఖ ఉక్కు ప్రైవేటు హక్కు'' అని నినదించాల్సి ఉంటుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఈ ప్లాంట్ లో వంద శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయం  తీసుకుంది.విశాఖపట్నం స్టీలు ప్లాంటును 100% ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే గత బుధవారం ట్వీట్‌ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.ఈ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలతో పాటు అన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టనున్నారు.కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.2018-19 బడ్జెట్ లోనే 34 శాతం వాటాను విక్రయించేందుకు సన్నాహాలు చేశారు. అయితే.. అప్పట్లో ఉద్యమం తెరమీదికి రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు.దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కు ఇప్పటికే 3వేల ఎకరాలు కట్టబెట్టారు.ప్రస్తుతం ఈ నవరత్న సంస్థలో  కేంద్ర ప్రభుత్వానికే 100% వాటాలున్నాయి.*

*✊స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన అతి పెద్ద ఫ్యాక్టరీ విశాఖఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గొంతెత్తి, తెన్నేటి విశ్వనాథం ఆధ్వర్యంలో తెలుగు వాళ్ళు చేసిన నినాదాలు అలల ఘోషతో పోటీపడ్డాయి.రాజీపడని, అలుపెరగని ఆ పోరాటం సాగరతీరాన తొలి ఉక్కుకర్మాగారానికి పురుడు పోసింది.కేంద్రం పూర్తిస్థాయి నిధులతో నిర్మాణమైన ఆ కర్మాగారం విశాఖ రూపురేఖలను మార్చివేసింది.ఈ సంస్థపై ప్రస్తుతం 18వేల మంది శాశ్వత కార్మికులు,మరో 18వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారు.పరోక్షంగా లక్షలాది మందికి జీవనాధారంగా ఉంది. ఈ ప్లాంట్ ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపేణా ప్రతి ఏడాది సుమారు రూ.30వేల కోట్లు వస్తున్నాయి.స్టీల్ ప్లాంట్ కేంద్రంగా అభివృద్ధి ప్రారంభమై రాష్ట్రమంతా విస్తరించింది.ప్రజల జీవన ప్రమాణాలను పెంచింది. స్టీల్‌ ప్లాంట్‌ను,విశాఖను విడదీసి చూడలేం.ఉక్కు ఫ్యాక్టరీతో విశాఖ ఉక్కు నగరంగా మారింది.*

*చరిత్రలోకి వెళితే..*

*👉1964 శీతాకాల సమావేశాల్లో పరిశ్రమల ప్రణాళిక ముసాయిదాపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు, ''పరిశ్రమల విషయంలో మొదటి మూడు  పంచవర్ష ప్రణాళికల్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని సరిచేయటానికి ప్రతిపాదిత ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే నెలకొల్పాలి.అలా నెలకొల్పే వరకూ అసమతుల్యత తొలగిపోదు.రాష్ట్రాన్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు'' అని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆ డిమాండ్‌కు అప్పటి ప్రతిపక్ష పార్టీ నాయకులు పి.వెంకటేశ్వర్లు (సీపీఐ), టి.నాగిరెడ్డి (సీపీఎం), జి.లచ్చన్న (స్వరాజ్య), తెన్నేటి విశ్వనాథం (నేషనల్ డెమొక్రాట్స్), వావిలాల గోపాల కృష్ణయ్య (ఇండిపెండెంట్) తదితరులు మద్దతిచ్చారు.*

*👉అయితే.. ఐదో ఉక్కు పరిశ్రమ స్థాపన అధ్యయనం మీద మొదట హిందుస్తాన్ స్టీల్ ఇచ్చిన నివేదిక.. విశాఖపట్నానికి అనుకూలంగా లేదు. అప్పుడు కేంద్రంలో ఉక్కుశాఖ మంత్రిగా నీలం సంజీవరెడ్డి ఉన్నారు. ఆయన.. 1965 జనవరి 27న బ్రిటిష్ అమెరికన్ స్టీల్ వర్క్స్ ఫర్ ఇండియా కన్సార్షియం (బీఏఎస్ఐసీ - బేసిక్) పేరిట ఒక సాంకేతిక నిపుణుల బృందాన్ని నియమించారు.ఉక్కు పరిశ్రమను స్థాపించటానికి అనువైన ప్రదేశం గురించి నిష్పాక్షిక నిపుణుల అభిప్రాయం తెలుసుకోవటం ఆ కన్సార్షియం ఏర్పాటు లక్ష్యం.ఇది ఆరు వేర్వేరు స్థలాలు విశాఖపట్నం, బైలదిలా, గోవా, హోస్పేట్, సేలం, నైవేలీలను పరిశీలించింది. ఆ బృందం 1965 జూన్ 25వ తేదీన సమర్పించిన నివేదికలో దక్షిణ భారతదేశంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు.. సముద్ర తీరంలో అత్యంత అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నమని తేల్చింది. భూమి మీద హోస్పేట కూడా చాలా అనువైన స్థలమని పేర్కొంది.ఈ రెండు స్థలాల మధ్య ముడి సరకు రవాణాకు దూరం దగ్గరగా ఉండడంతో పాటు.. ఓడరేవు కూడా ఉన్న విశాఖపట్నం అన్ని విధాలా అనువైన ప్రాంతమని స్పష్టంచేసింది.కానీ ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హోస్పేటలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు మొగ్గు చూపింది.*

*👉దీనితో 1966 లో ఆంధ్రప్రదేశ్ అంతటా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. ఉద్యమం అనతికాలంలోనే ఊపందుకుని ఆ ఏడాది నవంబర్ ఒకటో తేదీన.. విశాఖపట్నంలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.ఆ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు,మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు.ఆ రోజు విశాఖతో పాటు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోయారు. తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది.1971లో శంకుస్థాపన చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత పూర్తిస్థాయి పని ప్రారంభించింది.1971న నాటి ప్రధాని ఇందిరా గాంధీ విశాఖ ఉక్కు పరిశ్రమకు శంఖుస్థాపన చేశారు.ఆమె మరోసారి ప్రధానిగా ఉండగానే 1981 నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రారంభమై ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది.*

*👉విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపించినప్పుడు సుమారు 22 వేల ఎకరాల భూమిని సేకరించారు.తొలినాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నా స్టీల్ ప్లాంట్ వాటన్నింటిని అధిగమించి 21,851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది.నాలుగేళ్లలో 203.6% వృద్ధి సాధించింది.2002 సంవత్సరం నుంచి 2015 వరకు వేల కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో కేంద్రానికి చెల్లించింది.2010 నవంబరు 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సైట్‌ ప్లాంటు ఇదే.*

*ఇదీ నష్టాల చరిత్ర...*

*👉ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ సంస్థ.. 2015 నుంచి వరుసనష్టాల్లో కూరుకుపోయింది.సొంత గనులు లేకపోవడమే అందుకు కారణమని పార్లమెంటు స్థాయీసంఘం గుర్తించింది.దేశంలో సొంత గనులు లేని ఏకైక భారీ ఉక్కు పరిశ్రమ విశాఖ స్టీల్ ఒక్కటే. దీంతో ఇనుప ఖనిజం, థర్మల్, కోకింగ్ కోల్ బ్లాక్ ల కోసం ఒడిషా మినరల్ డవలప్ మెంట్ కార్పోరేషన్‍,బిస్రా స్టోన్ లైమ్ కంపెనీలపై ఆధారపడుతోంది.మార్కెట్ రేట్లకు అనుగుణంగా బయటి నుంచి ముడిసరుకును కొనుగోలు చేయడంతో విక్రయించే ప్రతి టన్ను స్టీలుపైన ఐదు వేల రూపాయలు కోల్పోవాల్సి వస్తోంది.తద్వారా సంస్ధపై ఏటా మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతోంది.ఇప్పుడు ఆ నష్టాల కారణంగానే కేంద్రప్రభుత్వం దీన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడానికి సిద్ధమైంది.2015-16లో రూ.1,420.64 కోట్లు, 2016-17లో రూ.1,263.16 కోట్లు, 2017-18లో రూ.1,369.01 కోట్ల నష్టం చవిచూసింది. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్‌ పరిస్థితులు, చైనా నుంచి వచ్చే చౌక దిగుమతులే.2018-19లో రూ.96.71 కోట్ల లాభం సంపాదించింది. విస్తరించిన యూనిట్ల నుంచి ఉత్పత్తిని పెంచి, మార్కెట్‌ను మెరుగుపరుచుకొంది.కానీ 2019-20 తొలి త్రైమాసికం నాటికి మళ్లీ రూ.636.78 కోట్ల నష్టాలు చవిచూసింది. సొంత గనులు లేక ముడిసరకునంతా బయటినుంచి కొనాల్సి వస్తోంది.కొన్నేళ్లుగా బహిరంగమార్కెట్‌లో ఇనుప ఖనిజం,బొగ్గు ధరలు పెరగడంతో రూ.4వేల కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చింది.ఆధునికీరణ, విస్తరణ చేపట్టడంతో పెద్దఎత్తున ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంది. 2018తో పోలిస్తే 2019 జూన్‌నాటికి ఉక్కు ఉత్పత్తి ఖర్చులు దాదాపు 7% పెరిగాయి. సంస్థను లాభాలబాటలో నడపడానికి మెకెన్సీ సంస్థను కన్సల్టెంటుగా పెట్టుకొన్నారు. వాళ్ల సూచనలు పాటిస్తే నష్టాల నుంచి బయటపడుతుందని అందరూ భావించారు. దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆశించారు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం 100% ప్రైవేటీకరణకు సిద్ధమైంది.*

*✊ఒక సమస్యకు పరిష్కారం లేనప్పుడు,ప్రత్యామ్నాయం లేనప్పుడు దానిని పరిష్కరించడం కష్టతరమవుతుంది.అదే సమస్యకు పరిష్కారం కళ్ళముందే కనిపిస్తున్నా ప్రత్యామ్నాయం పక్కనే ఉన్నా పరిష్కారం కావడం లేదంటే… లోపం సమస్యలో లేదు సమస్యను పరిష్కరించే ఆలోచనలో ఉందని అర్థం చేసుకోవాలి.విశాఖ ఉక్కు  ప్రైవేటీకరణ విషయంలోనూ కేంద్రం వైఖరి ఇదే తెలియజేస్తోంది.ప్రయిడ్ ఆఫ్ ఇండియా అంటూ గర్వంగా నిలబడ్డ భారీ పరిశ్రమను ప్రయివేట్ పరం చేయడం తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మార్కెట్లో పెట్టడమే.ఇప్పటికయినా కేంద్ర పాలకులు నీతిఆయోగ్ నిర్ణయాల ప్రకారం కాకుండా ప్రజా నిర్ణయం ప్రకారం నడుచుకుంటేనే వారు పాలక పక్షంలో ఉంటారు లేదంటే ప్రతిపక్షమే....*

*✊పోరాడితే పోయేదేమీ లేదు. ఉక్కు సంకెళ్లు తప్ప✊*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి